విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురై వీధుల్లో తిరుగుతున్న బాలలు, వివిధ షాపుల్లో పనులు నిర్వహిస్తున్న బాల కార్మికులను గుర్తించి, వారిని తిరిగి బడి బాట పట్టించేందుకు రాష్ట్ర సిఐడి అధికారుల ఆదేశాలతో ఈనెల 5 నుంచి10 వరకు ఆపరేషను స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించాం అని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ స్వేచ్ఛలో భాగంగా జిల్లాలోని కార్మికశాఖ అధికారులు, పోలీసులు, ఇతర శాఖలకు చెందిన లైను డిపార్టుమెంటు అధికారులతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ బృందాలను పర్యవేక్షించేందుకుగాను మహిళా పోలీసు స్టేషను ఇన్స్పెక్టరు ఈ.నర్సింహమూర్తిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. ఈ బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోగల ఇటుక బట్టీలు, మెకానిక్, బట్టలు, చెప్పులు, హెూటల్స్, స్వీట్, టీ, నగల షాపులు, పుష్ కార్ట్ వెండర్స్ వద్ద పనులు నిర్వహించి బాలలను గుర్తించి, నిబంధనలు అతిక్రమించిన షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగు నిర్వహించి, తిరిగి వారిని బడి బాట పట్టించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు.ఈ బృందాలు ఈ నెల 5 నుండి 10 వరకు జిల్లాలోని విజయనగరం పట్టణం, కొత్తవలస, ఎల్. కోట, బొబ్బిలి, తెర్లాం, నెల్లిమర్ల, వేపాడ, రామభద్రపురం, జామి, బాడంగి, ఎస్.కోట, చీపురుపల్లి, గరివిడి, రాజాం, ఆర్.ఎ.వలస, సంతకవిటి, వంగర మండలాల్లో వివిధ షాపుల్లో దాడులు నిర్వహించి, పనులు నిర్వహిస్తున్న బాలలను గుర్తించి, వారిని పనుల్లో పెట్టుకున్న షాపు యజమానులకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగు నిర్వహించి, వారిని చదివించాలని, వారి జీవితాలను నాశనం చేయవద్దని, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరామన్నారు. వీధి బాలలను తిరిగి బడి బాట పట్టే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని షాపు యజమానులు, తల్లిదండ్రులను హెచ్చరించామన్నారు. బాలలను పనుల్లో పెట్టుకున్న షాపు యజమానులకు కార్మిక శాఖాధికారులు నిబంధనల మేరకు జరిమానాలు విధించారని ఎస్పీ జిందల్ తెలిపారు.