కలెక్టరేట్లో చిత్రాలు వేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రజలు, ప్రజా ప్రతినిధులు
ఆయన జిల్లాకి కలెక్టర్. విధి నిర్వహణలో విరామమెరుగకుండా పనిచేస్తారు. రాష్ట్రంలోనే జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపేలా పలు విభాగాలలో సేవలందిస్తున్నారు. విద్యారంగం తో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి, గిరిజన మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో కృషి చేస్తున్నారు. అలుపెరుగని అధికారిగా పార్వతీపురం మన్యం జిల్లాకు సేవలందిస్తున్నారు కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్. జిల్లాను స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే పలు శాఖల అధికారులు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిత్యం ఎంతో బిజీగా ఉండే ఆయన ఆదివారం సెలవు రోజున కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్స్ గ్యాలరీలో సవర చిత్రకళ ప్రదర్శనలో భాగంగా పలు చిత్రాలను వేశారు. ఆయనలోని చిత్రకళను వెలికి తీశారు. పెయింటింగ్స్ పై ఎంతో ఆసక్తి కనబరుస్తూ కలెక్టర్ వేసిన చిత్రాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో మంది అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్ పై అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.