పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ
కొమరాడ కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన పీవో
విద్యతో పాటు క్రీడలు ఇతర కార్యకలాపాల్లో ఆసక్తి పెంచుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోశ్ శ్రీవాస్తవ విద్యార్థులకు సూచించారు. కొమరాడలోని కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయం (కెజిబివి)ను శుక్రవారం పీఓ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినుల హాజరుపట్టీని, రిజిస్టర్లను పరిశీలించారు. తరగతి గదులు,వంట గదిని పరిశీలించిన ఆయన 10వ తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సందర్బంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఇతర కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచాలన్నారు. ముఖ్యంగా క్రీడల పట్ల ఆసక్తి పెంచు కోవాలని సూచించారు. క్రీడలతో నూతన ఉత్తేజం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడు తుందని చెప్పారు. అంతే కాకుండా ఇతర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తుందని, క్రీడల్లో ప్రతిభ కనబరచిన వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు లభిస్తాయని గుర్తు చేశారు. అందుకే ప్రతి విద్యార్థి వారికి నచ్చిన కార్యకలాపాల్లో పాల్గొనాలని హితవు పలికారు. విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.