తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు.
విఐపి బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు సెప్టెంబర్ 30న ఆమోదించబడవు.
తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుంది.
ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.
తమిళంలో, కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠo”, మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం.
ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు.
ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.
ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది.
సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ .
వి ఐ పి బ్రేక్ దర్శనం రద్దు
టీటీడీ అక్టోబర్ 1న విఐపి బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ విఐపిలు మినహా) రద్దు చేసింది. కనుక సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు దీనిని గమనించి టీటీడీ కి సహకరించవలసిందిగా మనవి.