కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ను కోరిన విజయనగరం ఎంపీ కలిశెట్టి
అరకు వ్యాలీకి హెలీప్యాడ్ సేవలు ప్రారంభించాలని కోరుతూ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఆయన హెలిప్యాడ్ సేవలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. అరకు వ్యాలీ ప్రకృతి సౌందర్యం, స్థానిక తెగల సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పర్యాటక ప్రాంతం, గిరిజన మ్యూజియం, పద్మాపూర్ గార్డెన్స్ వంటి విశేష ఆకర్షణలు అక్కడ ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రస్తుతం అరకు వ్యాలీకి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా, హెలిప్యాడ్ ఏర్పాటుతో సులభమైన ప్రయాణ సదుపాయాలు కల్పించవచ్చని, దీని వలన ఆపద పరిస్థితుల్లో స్థానికులకు సత్వర రవాణా, పర్యాటక వృద్ధికి తోడ్పడుతుందని మంత్రికి తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తే, అరకు వ్యాలీ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.