విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
రూ.40 వేలు విలువైన 8కిలోల గంజాయి, 2 మోటారుసైకిళ్ళు, 7 సెల్ ఫోన్లు సీజ్
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం నెల్లిమర్ల చంపావతి నది పరివాహక ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న 8గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 8 కిలోల గంజాయి, 2 మోటారు సైకిళ్ళు మరియు 7 సెల్ ఫోన్లను నెల్లిమర్ల పోలీసులు సీజ్ చేసి, నిందితులను రిమాండుకు తరలించినట్లుగా జిల్లా వకుల్ జిందాల్ ఎస్పీ తెలిపారు. కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాలు ఇవీ.. అనకాపల్లి జిల్లా, చోడవరం గ్రామానికి చెందిన (ఎ-1) సురభి పార్ధసారధి, (ఎ-2) జ్యోతుల బద్రినాధ్ అనే ఇద్దరు వ్యక్తులు, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలానికి చెందినవారు. (ఎ-3) కొర్ర భాస్కరరావు అనే వ్యక్తి వ్యక్తితో కలసి విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలోగల చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా, కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లుగా నెల్లిమర్ల పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గణేష్, సిబ్బంది దాడి చేసి, ఎనిమిదిమంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 8 కిలోల గంజాయి, 7 సెల్ ఫోన్లు, రెండు మోటారు సైకిళ్ళును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో (ఎ-1) అనకాపల్లి జిల్లా చోడవరంకు చెందిన సురభి పార్ధసారధి (ఎ-2) అనకాపల్లి జిల్లా చోడవరంకు చెందిన జ్యోతుల బద్రినాధ్ (ఎ-3) అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొర్ర భాస్కరరావు (ఎ-4) కృష్ణా జిల్లా కానుమూరు గ్రామానికి చెందిన గుంటూరు తేజ (ఎ-5), నెల్లిమర్ల మండలం దివకులపేటకు చెందిన కురుమునెల్లి గణేష్ (ఎ-6), విశాఖపట్నం సిటీ శివాజీపాలెంకు చెందిన డొప్ప అనుదీప్ (ఎ-7), విశాఖపట్నం సిటీ పాండురంగాపురంకు చెందిన సామిరెడ్డి రఘు చరణ్ (ఎ-8), విజయగరం శివాలయం వీధికి చెందిన అంధవరపు ఈశ్వరరావు అను వ్యక్తులు ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో నిందితులు ఎ-1 సురభి పార్ధసారధి, ఎ-2 జ్యోతులు బద్రినాధ్ అనే నిందితులకు ఎ-3 కొర్ర భాస్కరరావు గంజాయి సప్లై చేసే వారని విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఎ-4 నుండి ఎ-8 అయిన గుంటూరు తేజ, కరుమునెల్లి గణేష్, డొప్ప అనుదీప్, సామిరెడ్డి రఘు చరణ్, అంధవరపు ఈశ్వరరావు అనే నిందితులు గంజాయి సేవించేందుకు అలవాటు పడిన వ్యక్తులుగా గుర్తించి, అరెస్టు చేసామన్నారు. ఈ కేసులో గంజాయి విక్రయించే వారితో సహా, గంజాయి సప్లై చేసిన వారిని, వినియోగించిన వారిని కూడా అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టరు జి.రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.