విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
డయేరియా ప్రభావిత ప్రాంతాలు సందర్శించిన ఎంపీ
చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటించారు. అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సేవల స్థితిగతులను సమీక్షించి, ప్రభుత్వ వైద్య బృందాల కృషిని ప్రశంసించారు. వైద్య సిబ్బంది తక్షణ స్పందన వల్ల పరిస్థితి త్వరగా అదుపులోకి వచ్చిందని ఎంపీ అన్నారు. అలాగే, గ్రామస్థులకు పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాగునీటిని శుభ్రంగా ఉంచుకోవడం, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించడం అవసరమని స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో తాగునీరు మరింత పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
ఇలాంటి ఆరోగ్య సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను పాటించడం అత్యవసరం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి జనసేనా ఇన్చార్జి శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి ఆర్డీవో, జిల్లా పోలీస్ అధికారులు, తహసీల్దారు, డాక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.