ఉత్సవాల్లో భక్తులతో సంయమనం పాటించండి

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించండి

విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్

విజయనగరం ఉత్సవాలు, పైడితల్లమ్మ అమ్మవారి తొలేళ్ళు, సిరిమానోత్సవం పండుగ సందర్భంగా బందోబస్తు నిర్వహించేందుకు వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి  విధి నిర్వహణ, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం దిశా నిర్ధేశం చేసారు. బందోబస్తు మరియు భద్రత విధులు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంకు విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బందితో పోలీసు పరేడ్ గ్రౌండులో జిల్లా ఎస్పీ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – పండగను తిలకించేందుకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి ప్రజలు, భక్తులు జిల్లాకు వస్తారు. ఎవ్వరితో గొడవ పడొద్దన్నారు. భక్తులు, ప్రజలతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీకు ఇన్చార్జిలుగా వ్యవహరించే అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలన్నారు. సమస్యను సానుకూలంగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది చొరవ చూపాలన్నారు. ప్రతీ ఏడాది నిర్వహించే పండగ బందోబస్తు విధులేనని ఎవ్వరూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. పోలీసు సిబ్బంది సౌలభ్యం, విధి నిర్వహణలో ఖచ్చితత్వం కోసం బందోబస్తును రెండు షిఫ్ట్ ల్లో నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఎవరూ ఏ తరహా విధులు నిర్వహించాలో ఇప్పటికే సిబ్బంది, అధికారులకు అవగాహన కల్పించామన్నారు. సిరిమానోత్సవంలో ప్రెజర్ పాయింట్లు అయిన పాత సోనియా జంక్షన్, కస్పా జంక్షన్, గురజాడ రోడ్డు వంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సిరిమాను వెంట అనధికార వ్యక్తులు తిరగకుండా క్లియరెన్సు పార్టీలను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

*భక్తులకు ఖచ్చితమైన సూచనలు**
భద్రతాపరంగా భక్తులకు ఖచ్చితమైన సూచనలు మాత్రమే చేయాలని, వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. బందోబస్తు విధులను సక్రమంగా నిర్వహించాలని, పోలీసుశాఖకు మంచి పేరు తెచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కష్టించి పని చేయాలన్నారు. కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, రిలీవర్ వచ్చేంత వరకు అప్పగించిన బాధ్యతల నుండి వైదొలగవద్దన్నారు. ఎవరైనా బాధ్యతలను ఉల్లంఘిస్తే, అందుకు బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బందిని గుర్తించేందుకు రేడియం జాకెట్స్, షోల్డరుకు రెడ్ రిబ్బను ఇస్తున్నామన్నారు. షీ టీమ్స్, సేవాదళ్ సిబ్బంది ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుందని, వారు ఆయా డ్రెస్ కోడ్తో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సిరిమానోత్సవం పూర్తయిన తరువాత పోలీసు సిబ్బంది తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విధుల నుండి నిష్క్రమించ వద్దన్నారు. సిరిమానోత్సవం తరువాత అధిక సంఖ్యలో భక్తులు తిరిగి వెళ్ళే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత పోలీసు సిబ్బంది, అధికారులపైనే ఉందన్నారు. కావున, అధికారులు, సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూం నుండి సెట్లో అధికారులు ఇచ్చే సూచనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రధాన ఆలయం వెనుక నుండి దర్శనాలకు ఎవరికీ అనుమతి లేదని, సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దర్శనం పూర్తయిన తరువాత భక్తులను బయటకు పంపేయాలని భద్రత సిబ్బందికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, అనకాపల్లి క్రైం అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, ఎస్.రాఘవులు, పి.శ్రీనివాసరావు, ఎం.వీరకుమార్, పి.నాగేశ్వరరావు, సీతారాం, రాంబాబు మరియు పలువురు సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *