అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. 2027 మార్చిలో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులవారీ మోడల్ ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్లు, మార్కుల వెయిటేజీ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది.
తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల కోసం వేర్వేరుగా నమూనా ప్రశ్నపత్రాలను విడుదల చేసింది.
ప్రశ్నల విధానం, విభాగాలవారీ మార్కుల కేటాయింపు, పాఠ్యాంశాల వెయిటేజీపై విద్యార్థులు స్పష్టమైన అవగాహన పొందేందుకు ఈ బ్లూప్రింట్లు ఉపయోగపడనున్నాయి. కొత్త నమూనాకు అనుగుణంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం. 2027 ఎస్‌ఎస్‌సీ పరీక్షల బ్లూప్రింట్, మోడల్ పేపర్లకు సంబంధించిన అధికారిక ప్రకటనను బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
మోడల్ పేపర్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
విద్యార్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌ను తెరవాలి. హోమ్‌పేజీలో కనిపించే “SSC Public Examination 2027 Model Question Papers, Blue Prints and Weightage Tables” అనే లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం కావాల్సిన సబ్జెక్టు, మీడియంను ఎంచుకొని మోడల్ ప్రశ్నపత్రాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు మోడల్ పేపర్లను క్రమం తప్పకుండా సాధన చేయడంతోపాటు, బ్లూప్రింట్ ప్రకారం ముఖ్యమైన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.





