
*బిన్నిడి గ్రామం ఆదర్శప్రాయం..*
*లాభాదాయక పంటల దిశగా రైతులు మొగ్గు చూపాలి*
*గ్రామ యువత ఉపాధి కొరకు ప్రత్యేక చొరవ*
*గ్రామ ముస్తాబు’ ఉత్సవంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి వెల్లడి*
కొమరాడ, మార్చి 28 : మండలంలోని గుమ్మడివలస పంచాయతీ పరిధిలో గల మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఐకమత్యంతో అభివృద్ధి పథంలో పయనిస్తున్న బిన్నిడి గ్రామస్తుల కృషి మరెన్నో గ్రామాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి కొనియాడారు. గ్రామంలో వినూత్నంగా నిర్వహించిన ‘గ్రామ ముస్తాబు’ ఉత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాధారణంగా పండుగలు, పెళ్లిళ్లకే పరిమితమయ్యే అలంకరణను, ఒక ఉత్సవంలా గ్రామమంతా నిర్వహించడం అభినందనీయమ అని అన్నారు. గత రెండు నెలలుగా గ్రామస్తులందరూ శ్రమించి, వీధులన్నీ శుభ్రం చేసుకుని, చెక్-లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పూర్తి చేయడం వల్ల బిన్నిడి నేడు సుందరంగా తీర్చిదిద్దబడిందని తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా రహిత గ్రామంగా బిన్నిడి అవతరించడం గర్వకారణమన్నారు. రోడ్లకు ఇరువైపులా అందమైన మొక్కలు, భవిష్యత్తు ఆదాయం కోసం కొబ్బరి చెట్లు నాటడం గ్రామస్తుల దూరదృష్టికి నిదర్శనమని చెప్పారు. సహజసిద్ధమైన వెదురుతో కాంపౌండ్ వాల్స్ నిర్మించి గ్రామానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారని,
మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, యువత భవిష్యత్తు కోసం పోటీ పరీక్షల పుస్తకాలతో కూడిన లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ లైబ్రరీ ద్వారా గ్రామం నుంచి ఎంతోమంది ఉన్నత ఉద్యోగస్థులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. గ్రామ యువత ఉపాధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, మరియు అగ్నివీర్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేయించి, వారికి కావాల్సిన ఫిజికల్ మరియు రిటన్ టెస్ట్ శిక్షణను ప్రభుత్వం తరపున అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రధాన పంటైన జీడి మామిడి తోటలు కాలక్రమేణా దిగుబడి తగ్గిపోతున్నాయని, రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో ‘కటింగ్’ మరియు ‘రీజువనేషన్’ (పునరుజ్జీవనం) చేయడం ద్వారా తిరిగి అధిక ఆదాయాన్ని పొందవచ్చని కలెక్టర్ సూచించారు. ఒకటి రెండు ఏళ్లు దిగుబడి తగ్గినప్పటికీ, ఆ తర్వాత చెట్లు కొత్త శక్తితో మరిన్ని కాయలు కాస్తాయని ఆయన వివరించారు. ప్రతి గ్రామంలో రైతులకు సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లను నియమించామని తెలిపారు. ఈ గ్రామంలో సాయికిరణ్ అనే అసిస్టెంట్ అందుబాటులో ఉన్నారని, రైతులు తమ పొలాల్లో ఎలాంటి పంటలు వేయాలి, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం ఎలా పొందాలి అనే విషయాలపై వారిని సంప్రదించి లబ్ధి పొందాలని కోరారు. అంతకుముందు గ్రామస్తుల సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వాయిద్యాలను స్వయంగా వాయించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె.రామచంద్రరావు, ఐటీడిఏ ఈఈ ఏ. మణిరాజ్, గ్రామ సర్పంచ్, ఇతర జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.






