పార్వతీపురం మన్యం జిల్లా
గుమ్మలక్ష్మీపురం మండలం భయ్యాడ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు గ్రామంలోకి రాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లోనూ బాధలు తప్పడం లేదు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను డోలిలో రేగిడి గ్రామం వరకు 4 కిలోమీటర్లు మోసుకువచ్చారు. అక్కడి నుంచి ఆటో సాయంతో కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
రోడ్డు లేకపోవడం వల్ల ప్రతి సారి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని తరలించేందుకు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తోందని తెలిపారు. తక్షణమే భయ్యాడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను గ్రామస్తులు కోరుతున్నారు.






